యాభై ఏళ్ల కలకు వంతెన..
ఎలిశెట్టిపెల్లికి బ్రిడ్జి గ్రీన్ సిగ్నల్
మంత్రి సీతక్క ఆదేశాలతో కదిలిన అధికారులు..
అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదన పంపింపు
వర్షాకాల కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు..
కాకతీయ/ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లి గ్రామస్తుల యాభై ఏళ్ల నిరీక్షణకు ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. గ్రామం వద్ద ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్థల పరిశీలన నిర్వహించి అంచనాలు సిద్ధం చేశారు. ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించడంతో బ్రిడ్జి మంజూరుకు మార్గం సుగమమైంది. ప్రతి వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనేది. గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించిన మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులను ఆదేశించారు. త్వరలోనే బ్రిడ్జి మంజూరుతో ప్రజల కష్టాలు తీరనున్నాయని అధికారులు తెలిపారు. బ్రిడ్జి ప్రతిపాదనతో గ్రామానికి మోక్షం లభించినట్లైందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క కృషిని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఎలిశెట్టిపెల్లి సహా పరిసర గ్రామాల అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది.


