డోర్నకల్‌లో మహిళా శక్తికి ఊతం
వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ
కాకతీయ, డోర్నకల్ : డోర్నకల్ నియోజకవర్గ మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాల సబ్సిడీ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్ మహిళా సంఘాల సభ్యులకు రూ.58,20,806 విలువైన వడ్డీ లేని రుణాల సబ్సిడీ చెక్కులను అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం కింద అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, వడ్డీ లేని రుణాలు, చీరల వంటి పథకాలు మహిళల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తాయని తెలిపారు. మహిళలు స్వావలంబన సాధించి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాల నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


