సింగరాయ గుట్టల్లో పెద్ద పులి
మూడు జిల్లాల సరిహద్దుల్లో భయాందోళనలు
పశువులపై దాడులు.. గ్రామాల్లో అప్రమత్తత
కాకతీయ, హుస్నాబాద్ : యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్ధిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం ప్రజలను గడగడలాడిస్తోంది. సింగరాయ గుట్టల అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. మోయాతూమ్మెద వాగు పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల ముద్రలు కనిపించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తంగళ్లపల్లి–కూరెళ్ల గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో రాత్రివేళల్లో వినిపిస్తున్న గాండ్రింపు శబ్దాలు ప్రజలను నిద్రపోనివ్వడం లేదు. ఆరెపల్లి పరిధిలోని చంద్రనాయక్ తండా వద్ద బానోత్ రమేష్ నాయక్‌కు చెందిన ఆవులు, ఎద్దులపై పులి దాడి చేసి చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పొలాల్లో పశువుల అవశేషాలు కనిపించడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. సమాచారం అందుకున్న హుస్నాబాద్ అటవీ రేంజర్ సిద్ధార్థ్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, కోహెడ ఎస్సై అభిలాష్ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పశువులను గ్రామాల వద్దే ఉంచుకోవాలని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. పిల్లలను బయటకు పంపడం లేదు. అటవీ శాఖ పులిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినా, సంచారం కొనసాగుతుండటంతో ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు.


