మహిళా సాధికారతకు పెద్దపీట
వడ్డీ లేని రుణాలతో ఆర్థిక భరోసా
జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా
రుణాల చెల్లింపులో జిల్లా మహిళలే ముందంజ : ఎమ్మెల్య పల్లా
కాకతీయ, జనగాం : ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని జనగాం పట్టణంలోని ఓం సాయి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగాం మున్సిపాలిటీ పరిధిలోని 354 స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.1 కోటి 3 లక్షల విలువైన వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు అనుసంధానం, స్వయం ఉపాధి యూనిట్లు, ఇన్సూరెన్స్, ఉచిత బస్సు ప్రయాణం, వనిత టీ స్టాల్స్, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళతో పాటు దివ్యాంగ మహిళలు కూడా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం తీసుకునేలా ప్రభుత్వం నిబంధనల్లో సవరణ చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాద బీమా, రుణ బీమా ద్వారా మహిళా సంఘ సభ్యులకు భద్రత కలుగుతోందని, జిల్లాలో ఈ బీమా పథకాల ద్వారా రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభించిందని వివరించారు. మహిళలు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి తమ పిల్లలను మంచి భవిష్యత్తుకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్ సాధించిందని, ఇందులో బాలికలే ముందంజలో ఉన్నారని తెలిపారు. అలాగే పట్టణ పరిశుభ్రత కోసం ప్రజలు తమ వంతు బాధ్యతగా పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు.
రుణాల చెల్లింపులో జిల్లా ముందంజ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రుణాలు తీసుకోవడంలోనే కాకుండా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో కూడా జిల్లా మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ కృషితో బతుకమ్మ కుంట అభివృద్ధి జరిగి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకునే విధంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను సరైన చోట వేయడం ద్వారా పట్టణ శుభ్రతకు తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


