కాకతీయ, మహారాష్ట్ర : మహారాష్ట్రలో జరిగిన ఘోర సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. పాల్ఘడ్ జిల్లా నైగావ్‌లో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్‌లో 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై మూడు నెలలలో 200 మందికి పైగా లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. మీరా – భయందర్ వసాయి – విరార్ పోలీస్ విభాగంలోని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, జులై 26న ఎక్సోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్, హార్మొనీ ఫౌండేషన్ ఎన్జీవోల సహకారంతో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి బాలికను రక్షించింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు.
బాలిక వాంగ్మూలం విని అధికారులు షాక్:
హార్మొనీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్రహం మథాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను మొదట గుజరాత్‌లోని నడియాద్‌కు తీసుకెళ్లి మూడు నెలలపాటు 200 మందికి పైగా అత్యాచారం చేశారని పేర్కొన్నారు. పాఠశాలలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రుల మందలింపు భయంతో, తనకు తెలిసిన ఒక మహిళతో కలిసి ఇంటి నుంచి పారిపోయిన బాలికను, అదే మహిళ రహస్యంగా భారతదేశానికి తీసుకువచ్చి వ్యభిచారంలోకి నెట్టింది. ఈ బాలిక చెప్పిన ప్రతీ ఒక్కరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి అని మథాయ్ డిమాండ్ చేశారు.
పోలీస్ కమిషనర్ నికెత్ కౌశిక్ మాట్లాడుతూ.. ఈ నేరజాలాన్ని పూర్తిగా చెరిపేసి, బాధితులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.


