- గోపీనాథ్ మృతిపై తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
- రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర రెవెన్యూ ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ డివిజన్ తో సహా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. బోరబండలోని సాయిబాబానగర్,జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ అసోసియేషన్ల సభ్యులు, పలువురు అర్చకులు మంత్రి పొంగులేటి సమక్షంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రెహ్మత్‌నగర్ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాథ్ విషయంలో కేటీఆర్ విలన్ అని సాక్షాత్తూ గోపీనాథ్ తల్లిగారే ప్రకటించారని అన్నారు. గోపీనాథ్ మృతి ఓ మిస్టరీ అని ఆమె చెప్పడం చూస్తే కల్వకుంట్ల కుటుంబ వైఖరి అందరికీ అర్దమవుతుందన్నారు. గతంలో వేలాది మంది తెలంగాణ యువతను ఉద్యమానికి ఆహుతిచ్చిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఎందరో ఉద్యమ నాయకులను పాతాళానికి తొక్కేశారని గుర్తు చేశారు. తాజాగా కవితను కూడా బయటకు పంపి కాళేశ్వరంలో వచ్చిన కమీషన్లలో వాటా ఇవ్వకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
కవిత జాగృతి సంస్ధ కార్యకర్తలు ఇప్పుడు బిఆర్ఎస్‌కు ఈ ఎన్నికల్లో బుద్దిచెబుతారన్న ఆశాభావాన్ని మంత్రి గారు వ్యక్తం చేశారు. హీన రాజకీయ చరిత్రకలిగిన కేసీఆర్ కుటుంబ రాజకీయాలకు మాగంటి గోపీనాధ్ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిని ఆ రాష్ట్రానికి వెళ్లిపోయి ధర్నాలు చేసుకోమన్న కేటీఆర్ ఇప్పుడు తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రజలకు ముఖం చూపించలేక అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్ దాటడం లేదని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు నెలకు 23వేల క్వింటాళ్ల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని దేశంలోనే ఇటువంటి పధకం ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తుండగా ఈ బియ్యం పంపిణీని విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ఆపేస్తామంటూ కాంగ్రెస్ వారు ఎక్కడా ఎవరూ చెప్పకపోయినా కేవలం ఓట్ల రాజకీయంతో బిజేపీ కిషన్ రెడ్డి అలా మాట్లాడడం సరికాదన్నారు.


