ఎన్‌ఐటి లో కొత్త రికార్డు..
దేశీయంగా రూ. 1.27 కోట్ల అత్యధిక ప్యాకేజీ..
ప్లేస్‌మెంట్ సీజన్ 2025–26 ప్రారంభ దశలోనే అద్భుత ఫలితాలు..
కాకతీయ, వరంగల్ బ్యూరో : దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఎన్‌ఐటి వరంగల్ మరోసారి తన ప్రతిభను నిరూపించింది. ప్లేస్‌మెంట్ సీజన్ 2025–26 ప్రారంభ దశలోనే అత్యధిక దేశీయ ప్యాకేజీ రూ. 1.27 కోట్లు రికార్డు నమోదైంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బి.టెక్ విద్యార్థి నారాయణ త్యాగి ఒక ప్రముఖ బహుళజాతి సంస్థ నుంచి రూ. 1.27 కోట్ల సీటీసీతో ఆఫర్ అందుకున్నారు. ఇది ఎన్‌ఐటి వరంగల్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక దేశీయ ప్యాకేజీగా నిలిచింది. అదే సమయంలో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ. 1.0 కోటి సీటీసీతో మరో దేశీయ ఆఫర్ సాధించారు. ఈ ఘనతలు ఎన్‌ఐటి వరంగల్ విద్యా ప్రమాణాలు, పరిశ్రమలతో ఉన్న బలమైన బంధాలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభ రెండు నెలల్లోనే వివిధ విభాగాల విద్యార్థులు విశేష అవకాశాలను అంది పుచ్చుకున్నారు.
రెండు నెలల్లోనే రికార్డు స్థాయి ప్యాకేజీలు..
రూ. 70 లక్షలకు పైగా సీటీసీతో 6 మంది విద్యార్థులు ఆఫర్లు పొందారు. రూ. 50 లక్షలకు పైగా సీటీసీతో 34 మంది విద్యార్థులు, రూ. 30 లక్షలకు పైగా సీటీసీతో 125 మంది విద్యార్థులు, రూ. 25 లక్షలకు పైగా సీటీసీతో 163 మంది విద్యార్థులు, రూ. 20 లక్షలకు పైగా సీటీసీతో 200 మందికి పైగా విద్యార్థులు, సగటు ప్యాకేజీ రూ. 26 లక్షలు దాటింది అని తెలిపారు. ప్లేస్‌మెంట్ సీజన్ ఇంకా కొనసాగుతుండగా, అనేక ప్రముఖ సంస్థలు త్వరలో క్యాంపస్‌ను సందర్శించనున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే నెలల్లో మరిన్ని అధిక విలువ గల ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎన్‌ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. మా విద్యార్థుల ప్రతిభ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, మా సంస్థపై రిక్రూటర్ల నమ్మకాన్ని ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి, అని అభినందనలు తెలిపారు. అలాగే, ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి సి పి డి ) బృందానికి, దాని హెడ్ ప్రొఫెసర్ పి.వి. సురేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఐటి వరంగల్‌లో రాబోయే నెలల్లో మరిన్ని రికార్డు స్థాయి ప్లేస్ మెంట్‌లు నమోదయ్యే అవకాశముందని సంస్థ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.


