ఎల్లప్పుడూ మీ ముందుకు న్యాయ సేవలు.
కాకతీయ, కరీంనగర్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి (హ) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాలు, జాతీయ న్యాయ సేవల టోల్ ఫ్రీ నంబర్ 15100, అలాగే మాదక ద్రవ్యాల నిరోధక మరియు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించారు.బాలికలు అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, మొబైల్ ఫోన్లను చెడు ప్రయోజనాలకు ఉపయోగించడం వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


