విద్యార్జనలో పోటీతత్వం పెంపొందించుకోవాలి
ప్రధానోపాధ్యాయుల సంఘం మండల కోఆర్డినేటర్ చరణ్ సింగ్
జిల్లా స్థాయి పోటీ పరీక్షలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
కాకతీయ,ఖానాపురం: విద్యార్జనలో బాలబాలికలు పోటీతత్వం కలిగి ఉండాలని వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా కృషి ఉపాధ్యాయ బృందం కృషి చేస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మండల కోఆర్డినేటర్ చరణ్ సింగ్ అన్నారు. ఖానాపురం మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో టి సాట్- జిహెచ్ఎంఏ ఆధ్వర్యంలో సంయుక్తంగా వార్షిక పోటీ పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 6నుండి 10 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు నిర్వహించే పోటీ పరీక్షల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
టి సాట్- జిహెచ్ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షలకు మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు 55 మంది విద్యార్థినీ విద్యార్థులతో కలిసి తమ గైడ్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. టి సాట్- జిహెచ్ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీతత్వ పరీక్షల్లో మూడు విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన ముగ్గురు విద్యార్థులను ఈ నెల 10 వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కోఆర్డినేటర్ చరణ్ సింగ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సోమలక్ష్మి, ఉపాధ్యాయులు వేములపల్లి రామ్మోహన్ రావు, రవీందర్, మోతీలాల్, శశికుమార్, వీరన్న, శ్రీనివాస్, రవికుమార్ ఎం ఆర్ సి వీరమల్ల శశిధర్, పాలకుర్తి మహేందర్, రావుల రాజేందర్, తండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.



