కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం కరీంనగర్ పర్యటనకు రానుండటంతో నగరంలో పారిశుధ్య పనులు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ పారిశుధ్య పనులు, గవర్నర్ రూట్ మ్యాప్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అలుగునూర్, ఎన్టీఆర్ జంక్షన్, బద్ధం ఎల్లరెడ్డి జంక్షన్, కామన్, వన్ టౌన్ జంక్షన్, బస్టాండ్, ప్రతిమ చౌరస్తా, గీతాభవన్, రాంనగర్, చింతకుంట జంక్షన్ నుంచి శాతవాహన విశ్వవిద్యాలయం వరకు గవర్నర్ రూట్‌లోని రహదారులను కమిషనర్ తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులు, పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చెత్త కనబడకుండా పారిశుధ్య సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. రహదారుల వెంబడి డివైడర్ల పక్కన ఇసుక రేణువులు లేకుండా శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సానిటేషన్ సూపర్‌వైజర్ శ్యామ్‌రాజ్, డీఈ శ్రీనివాస్‌తో పాటు పారిశుధ్య విభాగ సిబ్బంది పాల్గొన్నారు.


