కలెక్టర్ కరుణించిన.. ఇల్లు రాకపోయే…
కూలిన ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్న దళిత కుటుంబం…
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దంపతులు…
ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని వేడుకోలు…
కాకతీయ, ఖానాపురం : దేవుడు వరమిచ్చిన పూజరి కనుకరించనట్లు తయారయ్యింది వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన దళిత కుటుంబం చిన్నపెళ్లి లక్ష్మి- ఎల్లయ్య దంపతుల పరిస్థితి. వివరాల్లోకి వెళితే పెదోడికి పక్కా గృహం ఉండాలని దృడ సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి ప్రదేశాలను చూడడానికి ప్రాథమిక సర్వేకు ఖానాపురం మండలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వచ్చి పరిశీలించడం జరిగింది. తదనంతరం స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన విధివిధానాలను గ్రామ, మండల అధికారులకు తెలియజేసి తిరుగు ప్రయాణం అవుతుండగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన దళిత కుటుంబం చిన్న పెళ్లి లక్ష్మీ ఎల్లయ్య దంపతులు తమ ఇల్లు వర్షాలకు కొంత భాగం కూలిపోయిందని అభాగ్యులుగా ఉన్నామని, కూలిపోయిన ఇంటిలోనే నివాసం ఉంటున్నామని తమకు పక్కా గృహం మంజూరు చేయాలని కలెక్టర్ ను వేడుకోవడం జరిగిందనీ బాధిత కుటుంబం తెలిపారు. పక్కనే ఉన్న గ్రామ కార్యదర్శి ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకొని బాధిత కుటుంబానికి వెంటనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారి చేయడంతో తమకు పక్కా ఇల్లు వస్తుందని సంతోషం వ్యక్తం చేసిన కుటుంబానికి ఆ సంతోషం కొన్ని రోజులకే పరిమితమైందని, లోకల్ రాజకీయాలతో ఆదిలోనే అడ్డుకట్టపడ్డట్టు బాధిత కుటుంబం తెలుపుతుంది.
మళ్లీ కూలిన ఇంటి గోడలు..భయాందోళనలో కుటుంబం
గత వారం రోజుల క్రితం మొంథా తుఫాను ప్రభావితం వల్ల కురిసిన భారీ వర్షానికి మళ్లీ ఇంటి గోడలు నాని కూలిపోవడంతో, మొత్తం కూలిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో గోడలకు కర్రలను సపోర్ట్ గా ఉంచి జీవనం సాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది.
పక్కా ఇంటిని మంజూరు చేయండి
చిన్నపెళ్లి లక్ష్మి-బాధితురాలు
ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ఇంటి గోడలు తడిసి మొత్తం కూలిపోతున్నాయని, దినదిన గండంగా బతుకుతున్నామని ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి పక్క ఇంటికి మంజూరు చేయాలనికోరుతున్నారు.



