- ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో కాల్పుల మోత
- ముగ్గురు మావోయిస్టులు మృతి
- మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు
- కొనసాగుతున్న ఎదురుకాల్పులు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దుకు సమీపంలోని తార్లగూడ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే… అన్నారం, మరిమల్ల గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బృందాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను, కొన్ని ఆయుధాలను స్వాధీనం పోలీసులు స్వాధీనంచేసుకున్నాయి.
అయితే, దీనిపై అధికారికంగా పూర్తి ప్రకటన వెలువడాల్సి ఉంది.
ముమ్మరంగా కూంబింగ్
2026 మార్చి నాటికి దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2024 జనవరిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1,785 మందిని అరెస్ట్ చేశారు. వివిధ ఆపరేషన్లలో 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకవైపు సైనిక చర్యలు కొనసాగిస్తూనే, మరోవైపు ‘ఆత్మసమర్పణ్ ఏవం పునర్వాస్ నీతి 2025’, ‘నియాద్ నెల్ల నార్ యోజన’ వంటి పథకాల ద్వారా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తూ ప్రభుత్వం ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది.


