- వెండి, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం
కాకతీయ, హుజురాబాద్: జమ్మికుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా వరుస దొంగతనాల నిందితుడిని అరెస్టు చేశారు. మోతుకూలగూడెం శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సీఐ రామకృష్ణ గౌడ్ బృందం, అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా నిందితుడు చిక్కాడు. ఆటోలో ఎరుపు రంగు గడ్డపార కనిపించడంతో పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించగా, అతను జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సోమ సారయ్య (58) అని తేలింది. విచారణలో 2010లో భార్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి, విడుదలైన తర్వాత జైలులో పరిచయమైన దొంగల సహాయంతో మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు. సారయ్య జమ్మికుంట, ధర్మారం, రాచపల్లి పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. ఇటీవల ఎస్‌ఎల్‌ఎస్ జ్యువెలరీ షాప్‌లో బంగారు ముక్కుపుడకలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి ఒక కిలో 535 గ్రాముల వెండి, ఐదు గ్రాముల బంగారు ముక్కుపుడకలు, రూ.38,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగ పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్స్ రాజు, రవిని ఏసీపీ మాధవి నగదు బహుమతులతో సత్కరించారు.


