- సమాజ హితం, ధర్మరక్షణకు సిక్కు గురువుల త్యాగం అపారం
- ఆర్ఎస్ఎస్ నేత బూర్ల దక్షిణామూర్తి
కాకతీయ, కరీంనగర్ : సిక్కు గురువులు సమాజహితం, ధర్మరక్షణ, మానవ సేవ కోసం జీవితాన్ని అర్పించారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యుడు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. గురు గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని గురుద్వారలో ఆర్ఎస్ఎస్ విభాగ్ బాధ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బూర్ల దక్షిణామూర్తి మాట్లాడారు. మొదటి గురువు గురు నానక్ దేవ్ నుంచి పదో గురువు గోవింద్ సింగ్ వరకు అందరూ సమాజ హితం, ధర్మ స్థాపన కోసం, గురు తేజ్ బహుదూర్ మత స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. గురు గోవింద్ సింగ్ ధైర్యం, సమానత్వం, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచారని తెలిపారు. గోవింద్ సింగ్ కేవలం సిక్కు మత నాయకుడు మాత్రమే కాదని, భారతదేశం గర్వించదగిన యోధుడు, ఆధ్యాత్మిక నాయకుడని దక్షిణామూర్తి అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు రాజశేఖర్, సుధాకర్, బాలరాజ్, భానుజీ తదితరులు పాల్గొన్నారు.


