కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ చింతకుంట నుంచి జగిత్యాల రోడ్డు వరకు ఉన్న నేషనల్ హైవే–563 బైపాస్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి దుర్గం మారుతి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి పద్మానగర్ మానేరు స్కూల్ వరకు, చింతకుంట నుంచి కొత్తపెళ్లి జగిత్యాల రోడ్డు వరకు రహదారి పరిస్థితిని పరిశీలించారు. 2009లో నిర్మించిన ఈ రహదారి ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో అనేక గుంతలతో ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అథారిటీ, రాష్ట్ర రోడ్లు–రవాణా శాఖ సంయుక్తంగా ఈ రహదారి అభివృద్ధి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మారుతి కోరారు.


