- పిల్లల రక్షణలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముందుండాలి
- న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్
కాకతీయ, కరీంనగర్ : పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో చట్టం (పిల్లల లైంగిక దాడుల నుండి సంరక్షణ చట్టం) అమల్లో పాఠశాలల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వెంకటేష్ తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సహకారంతో పోక్సో, బాలన్యాయ చట్టం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతకు పాఠశాలలు, ఉపాధ్యాయులు ముందుండాలని సూచించారు. బాధిత విద్యార్థులకు తక్షణ న్యాయ సహాయం, ఫిర్యాదుల గోప్యత కాపాడడం పాఠశాలల ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. 18 ఏళ్ల లోపు పిల్లలు నేరాలకు పాల్పడినప్పుడు వారిని స్నేహపూర్వక వాతావరణంలో విచారణ చేయడంలో పాఠశాలలు సహకరించాలని సూచించారు.
న్యాయ సలహా లేదా సహాయం అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. పిల్లల రక్షణలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి రక్షణ కవచంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య, లీగల్ ఎయిడ్ ఉపన్యాయవాది మహేష్ తణుకు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు ఏ. కిరణ్ కుమార్, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, ప్రణాళిక సంయోజకుడు మీలుకూరి శ్రీనివాస్, నాణ్యత సంయోజకుడు కర్ర అశోక్ రెడ్డి, విద్యా మద్దతు సమన్వయకర్త కృపారాణి, కమ్యూనిటీ సంయోజకుడు ఆంజనేయులు, డీయస్.ఓ జయపాల్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్, కేజీబీవీ సంస్థల అధికారులు పాల్గొన్నారు.


