- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ,రాయపర్తి : మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ లో పోసిన తర్వాతనే కాంటాలు చేపట్టాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఊకల్లు, కొండూరు గ్రామాలలో పర్యటించి ముంపునకు గురైన పంటలను పరిశీలించారు.పంట నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. పంట నష్టం పై స్పష్టమైన అంచనా పొందడానికి వ్యవసాయ,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా కాజ్వేల వద్ద బ్రిడ్జిల ఏర్పాటుకు ఇరిగేషన్,ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీసీఈఓ రాంరెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్, ఏవో వీరభద్రం, ఏఈ బాలదాసు, ఏపీఎం రవీందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు హామ్యా నాయక్, వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


