- ఏడు లక్షల విలువైన 25 దుంగలు స్వాధీనం
కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసురు తహసీల్ పరిధిలోని భీమారం, కొత్తపల్లి అడవి ప్రాంతంలో టేకు కలప అక్రమ డంపుపై సోమవారం అటవీ శాఖాధికారులు దాడులు చేశారు. ఈ మేరకు పక్కా సమాచారంతో బీజాపూర్ జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో సిబ్బందితో అక్కడ కి చేరుకొని సోదాలు నిర్వహించి దాదాపుగా 25 దుంగలను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. కాగా, పది రోజుల క్రితమే ఇరవై దుంగలను తెలంగాణ రాష్ట్ర అటవీ అధికారులు స్వాధీనపర్చకుని అటవీ కార్యాలయానికి తరలించడం గమనార్హం. అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కావడంతో టేకు స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. పట్టుబడిన కలప విలువ సుమారు ఏడు లక్షలు వరకు ఉంటుందని బీజాపూర్ రేంజ్ అధికారి తెలిపారు. ఈ దాడులకు తెలంగాణ ఫారెస్ట్ అధికారులు కూడా సహకరించారన్నారు. స్థానికుల వాహనాల్లో స్వాధీనం చేసుకున్న కలపను ఛత్తీస్ గఢ్ కు తరలించినట్లు వారు స్పష్టం చేశారు.


