శ్రమ దోపిడీ చేయడం సరికాదు
ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : కార్మికుల శ్రమ దోపిడీనీ ఆర్టీసీ సంస్థ తగ్గించాలనీ టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ టీ తామస్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ బస్టాండ్లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కన్నా ఆర్టీసీ కార్మికుల శ్రమదోపిడి ప్రస్తుత కాలంలో పెరిగిందన్నారు. ఎంతోమంది కార్మికులు అధికారుల ఒత్తిడి వల్ల మానసిక శారీరక సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ విధులు కొనసాగిస్తున్నారన్నారు. కార్మికులు మానసిక ఒత్తిడి వల్ల మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైర్ బస్సులతో ఆర్టీసీ ప్రైవేటు పరం చేయాలని చూసినా అప్పటి ప్రభుత్వాలను కార్మిక సంఘాలు అడ్డుకోవడం ద్వారా ఆగిపోయాయన్నారు. నేడు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో డిపోలే ప్రైవేట్ పరం అయ్యాయని పేర్కొన్నారు. లేబర్ ఆక్ట్ ప్రకారం కార్మికులు చేయవలసిన పని గంటలకన్నా ఎక్కువ పని గంటలు కార్మికులతో చేయిస్తున్న సంస్థ వారికి వేతనాలు ఇవ్వడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం పెట్టడం ద్వారా కార్మికులకు ఒత్తిడి పెరిగిందన్నారు. మహిళల టికెట్ల డబ్బులు సంస్థకు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల సంస్థ నష్టాల్లో ఉందని ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు జీరో టికెట్ కాకుండా డబ్బులు ఎన్ని తెచ్చావు ఎందుకు తేవడం లేదని కండక్టర్లపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ టీఎస్ సింగ్, వేల్పుల ప్రభాకర్, మార్త రవీందర్, ఆగయ్య, సమ్మిరెడ్డి, వెంకటరెడ్డి, రాజమౌళి, సారయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.


