స్లాట్ విధానంతోనే పత్తి కొనుగోళ్లు
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్ : పత్తి కొనుగోళ్లు కేవలం స్లాట్ విధానంలోనే జరుగుతున్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతుల సౌకర్యార్థం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నదన్నారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలు నివారించడమే లక్ష్యమని తెలిపారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరహాలో కాకుండా, సీసీఐ, వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన సమయానికి మాత్రమే తీసుకురావాలని సూచించారు. స్లాట్ విధానం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. ఈ ఏడాది పత్తికి క్వింటాలుకు రూజ. 8,110 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. తేమ శాతం తక్కువగా, నాణ్యతతో ఉన్న పత్తికి గరిష్ఠ ధర లభిస్తుందని చెప్పారు. మధ్యవర్తుల చేత మోసపోకుండా రైతులు పత్తిని నేరుగా సీసీఐ కేంద్రాలకు మాత్రమే తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, ఏఎంసీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు పసుల వెంకటి, రాజేశం, సురేందర్ రెడ్డి, తిరుపతి గౌడ్, సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


