ఆమె ఎవరు..!?
ఎవరు చంపారు.. ఎందుకు చంపారు..!
అంతకిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది..?
మిస్టరీగా మిట్టాపూర్ శివారులో హత్య..
కలకలం రేపుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం
కాకతీయ, క్రైం బ్యూరో : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్-బాసర ప్రధాన రహదారి సమీపంలోని మిట్టాపూర్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన మహిళ మృతదేహం తల, మొండెం వేరు చేయబడి, వివస్త్రంగా పడి ఉంది. మృతదేహానికి తల లేదు, కుడిచేతి మణికట్టుతోపాటు ఎడమచేతి వేళ్లు సగానికి కోసి ఉన్నాయి. మృతురాలు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మహిళను వేరే చోట హత్య చేసి, ఆ తర్వాత ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేపట్టారు. మహిళ తల కోసం గాలిస్తున్నారు. ఈ కిరాతక సంఘటన స్థానికుల్లో భయాందోళనలను కలిగించింది.అయితే ఈ ఘటనకు మృతురాలు ఎవరన్నది తెలిస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య, ఏసీపీ, సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


