ఆస్తిలో వాటా కోసం
సొంత చెల్లెని ఇంటి నుంచి పంపినవ్..
మాగంటి సునీతమ్మను మంచిగా చూసుకుంటవా.. ?
సానుభూతితో ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం
2007లో పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్
కారు షెడ్డుకు పోయింది.. బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతుండ్రు
నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం
ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి
బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో కార్నర్ మీటింగ్స్
భారీగా హాజరైన హస్తం పార్టీ శ్రేణులు.. అభిమానులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన కేటీఆర్.. సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా.. సొంత చెల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా? అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌తోనే మైనార్టీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సానుభూతితో బీఆరెస్ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గత సంప్రదాయాలను తుంగలో తొక్కింది కేసీఆర్ అని.. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే ఏకగ్రీవంగా చేయాలంటే అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి అవమానించాడన్నారు. పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కారు షెడ్డుకు పోయిందని బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు.

పథకాలు కనిపించడంలేదా?
జూబ్లీహిల్స్ లో సమస్యలు పేరుకుపోవడానికి కారణం నువ్వు .. మీ అయ్య కాదా కేటీఆర్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు సమస్యలు పరిష్కరించి ఉంటే జూబ్లీహిల్స్ కు ఈ పరిస్థితి వచ్చేదా ? అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు మైనారిటీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. ఈ బస్తీల్లో రేషన్ కార్డులు ఇచ్చింది మేం కాదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్ కాదా?ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నది మేం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నిజం కాదా? కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీ గణేష్ ను గెలిపించగానే ఆ నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.

బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్
అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా.. ఎందుకు అడ్డుకోవాలని చూశారు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ పనిచేసింది.. ఇప్పుడు బీజేపీ వాళ్లు బీఆరెస్ ను గెలిపించేందుకు పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రంలో ప్రతీ సందర్భంలో మోదీకి కెసీఆర్ మద్దతు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుంది. మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించండి.. ఎమ్మెల్యేగా నవీన్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. పీజేఆర్ తరువాత జూబ్లీహిల్స్ కు నాయకుడు లేకుండాపోయారు. పీజేఆర్ వారసత్వాన్ని నవీన్ యాదవ్ కొనసాగిస్తారు. పేదలకు అండగా ఉంటారు. నవీన్ ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించండి.. అంటూ రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు.


