లక్‌నవూకు యునెస్కో గుర్తింపు
వంటకాల వారసత్వం విశ్వవ్యాప్తం
క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ఖ్యాతి
హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా రికార్డు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం
కాకతీయ, నేషనల్ డెస్క్: శతాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వంటకాల వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. లఖ్‌నవూను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో నిర్వహించి యునెస్కో 43వ సాధారణ సమావేశంలో అధికారికంగా ప్రకటించింది. లక్‌నవూకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘లఖ్‌నవూ ఒక శక్తివంతమైన సంస్కృతికి పర్యాయపదం. దాని ప్రధాన భాగంలో గొప్ప పాక సంస్కృతి ఉంది. ఈ అంశాన్ని యునెస్కో గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు లఖ్‌నవూను సందర్శించి దాని ప్రత్యేకతను కనుగొనాలని పిలుపునిస్తున్నా’ అని కేంద్ర మంత్రి షెకావత్ చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ ఈమేరకు రాసుకొచ్చారు.
‘రెండో భారతీయ నగరంగా గుర్తింపు’
‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ’గా హైదరాబాద్ తర్వాత రెండో భారతీయ నగరంగా లఖ్‌నవూ గుర్తింపు పొందిదని కేంద్ర సాంస్కృతిక మంత్రి, జోధ్‌పుర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. లఖ్‌నవూను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తించింది. ఇది దేశంలోని విశిష్టమైన వంటకాల వారసత్వానికి ఒక గొప్ప గౌరవం. ఇది లఖ్‌నవూను ప్రపంచ స్థాయిలోని ప్రతిష్ఠను పెంచి, ఆహారం, సంస్కృతి కేంద్రంగా గుర్తింపు తెచ్చింది. ఈ గౌరవం పర్యాటక ప్రోత్సాహం, సంస్కృతి ఆధారిత ఆర్థికాభివృద్ధి, వారసత్వ పరిరక్షణ అంతర్జాతీయ సహకారానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలపాలి. ఆయన దూరదృష్టి నాయకత్వంలో భారత్ విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి ప్రపంచ వేదికపై అపూర్వ గౌరవం గుర్తింపు పొందుతున్నాయి’ అని మంత్రి షెకావత్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. హైదరాబాద్‌ను 2019లో ఈ గౌరవం పొందిన నగరంగా యునెస్కో గుర్తించింది.


