సంపన్నులతో సామాన్యులు ఢీ !
రూ.5వేలలోపే పలువురి బ్యాంకు బ్యాలెన్స్
బిహార్ ఎన్నికల్లో అత్యంత పేద అభ్యర్థుల పోటీ
ఆసక్తిరేపుతున్న అసెంబ్లీ ఎన్నికలు
నవంబరు 6న తొలి విడత పోలింగ్
కాకతీయ, నేషనల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతల్లో అత్యధికులు కోటీశ్వరులే. అయితే కొందరు సామాన్యులు సాహసం చేసి వీరితో తలపడుతున్నారు. స్థిర, చరాస్తులేవీ లేకున్నా, బలం, బలగం కలిగిన దిగ్గజ నేతలను ఢీకొంటున్నారు. కేవలం రూ.1,000, రూ.2,000, రూ.5,000 బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు అభ్యర్థులు నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
సామాన్యుల ఆత్మస్థైర్యం
అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి రూ.10వేలను డిపాజిట్ చేయాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.5వేలను డిపాజిట్ చేసి నామినేషన్ వేయాలి. ఇంతకంటే తక్కువ రేంజులో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు వ్యక్తులు ఆత్మస్థైర్యంతో నామినేషన్లు వేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. వారంతా మేం సైతం ఎన్నికల ప్రచార బరిలోనూ దూసుకెళ్తున్నారు. తమతమ స్థాయిల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అభ్యర్థుల సగటు ఆస్తి విలువ : రూ.3.26 కోట్లు
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బిహార్ ఎలక్షన్ వాచ్ కీలకమైన సమాచారంతో తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. దాని ప్రకారం, నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1,303 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.3.26 కోట్లు.
ముజాహిద్ ఆలం : ఆస్తుల విలువ రూ.1000
బిహార్‌లోని దర్భంగ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి మహ్మద్ ముజాహిద్ ఆలం పోటీ చేస్తున్నారు. ఆయన ఎస్‌యూసీఐ (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అత్యంత పేద అభ్యర్థి ఆయనే. ముజాహిద్ ఆలం చరాస్తుల విలువ వెయ్యి రూపాయలే అని ఎన్నికల అఫిడవిట్‌లో ఉంది. గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన ముజాహిద్ ఆలం, ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు.
శత్రుఘ్న వర్మ ఆస్తుల విలువ రూ.1000
పట్నాలోని బార్ అసెంబ్లీ స్థానం నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శత్రుఘ్న వర్మ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కూడా వెయ్యి రూపాయలే. ముజఫర్‌పూర్ జిల్లాలోని మినాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి శివ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.2,023. అరా అసెంబ్లీ స్థానం నుంచి విపక్ష మహా ఘట్బంధన్ కూటమిలోని సీపీఐ-ఎంఎల్ పార్టీ తరఫున కయాముద్దీన్ అన్సారీ పోటీ చేస్తున్నారు. ఆయన వద్ద రూ.20వేల నగదు, రూ.5వేల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి


