కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు, మదనతుర్తి గ్రామాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను సీపీఎం నాయకులు శనివారం పరిశీలించారు. పార్టీ నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు వరి, పత్తి రైతులు నష్టపోయారన్నారు. ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంటలకు వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వ్యవసాయ అధికారులతో సర్వే నిర్వహించి రైతాంగానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రమేష్, వెంకన్న, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


