- భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
- బ్రహ్మోత్సవాల విజయవంతానికి శాఖల సమన్వయం అవసరం
- రూ.2 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల 4న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భద్రతా చర్యలు బలోపేతం చేయాలన్నారు. పార్కింగ్ స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వంతోపాటు దాతలు కూడా ఆలయ అభివృద్ధికి సహకరించాలన్నారు. తాను వ్యక్తిగతంగా రూ.2 లక్షల విరాళం అందజేస్తున్నట్లు కడియం ప్రకటించారు. ఎమ్మెల్యే పిలుపుతో మరికొంత మంది దాతలు విరాళాలు ప్రకటించారు.


