- సీరియస్ గా తీసుకున్న డీఎంఈ
- రంగంలోకి దిగిన వైధ్యాధికారుల బృందం
- ఐసీయూలో బాధితుడి వాంగ్మూలం సేకరణ
కాకతీయ, మహాబూబాబాద్ ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనంగా మారిన ‘బతికుండగానే మార్చురీ’ కి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలతో విచారణ ముమ్మరంగా సాగింది. అప్రతిష్ఠపాలైన ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ విచారణకు పలువురు వైధ్యాధికారులను నియమించి నిజాన్ని నిగ్గుతేల్చి దోషులును అన్వేషించే పనిలో నిమగ్నమైంది. ములుగు, జనగామ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, గోపాల్ రావు, సిద్దీపేట మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ నిపుణుడు శ్రీధర్ లతో కూడిన వైద్య బృందాన్ని నియమించింది. వారు వెంటనే మానుకోట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని శుక్రవారం విచారణ ప్రారంభించారు.
అసలు ఏం జరిగింది ? ఎలా జరిగింది? అనే కోణంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధిత రోగి వెల్డి రాజు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. అలాగే మార్చురీ స్వీపర్, పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ పుటేజ్ సైతం నిశితంగా పరిశీలించి బాధ్యులపై నివేదక రూపొందించనున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతోందని వివరాలు బహిర్గతం చేయలేమని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా నివేదికను డీఎంఈకి సమర్పించనున్నట్లు విచారాణాధికారులు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా దోషులను తేల్చి ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


