- నేరస్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే..
- సామినేని రామారావు హత్య బాధాకరం
- హత్యా రాజకీయాలు చేసేది ఎవరో అందరికీ తెలుసు
- డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: సామినేని రామారావు హత్య చాలా బాధాకరమని, నేరస్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే అని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. కాంగ్రెస్ హింసా రాజకీయాలను ప్రోత్సహించలేదని, విచారణ పూర్తికాకుండానే కాంగ్రెస్ నాయకులే హత్య చేశారని ఆరోపణలు చేయడం వారి కుటిల బుద్ధికి నిదర్శనమని అన్నారు. హత్య జరిగిన విషయం తెలియగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘలనను ఖండించి హుటాహుటిన పోలీస్ అధికారులకు విచారణ నిమిత్తం ఆదేశాలు జారీచేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలో ఓడిపోతుందని ఇలాంటి చర్యలకు దిగిందని సీపీఎం నాయకుడు పోతినేని సుదర్శన్ విమర్శలు చేయడం శోచనీయం అన్నారు. ఇలాంటి చర్యల వెనుక భట్టి విక్రమార్క ఉన్నాడని చెప్పడం అత్యంత బాధాకరం అన్నారు. పాతర్లపాడులో జరిగిన హత్యకు, కాంగ్రెస్ పార్టీకి, అక్కడి లోకల్ నాయకులకు సంబంధం లేదన్నారు. త్వరలోనే దోషులను పట్టుకొని శిక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి శవ రాజకీయాలను ఎవరూ ప్రోత్సహించవద్దని కోరారు. వ్యక్తిగత ఘటనల్లో రాజకీయ ఆరోపణలు చేయడం దుర్మార్గమైన రాజకీయ చర్య అన్నారు. కార్యక్రమంలో దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్ గౌడ్, జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు గజ్జి సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.


