కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం విజయవంతమైంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా 5 కిలోమీటర్ల మేర ఈ పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కాళోజీ అవార్డు విజేత నలిమెల భాస్కర్, దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ హాజరయ్యారు. పరుగులో విద్యార్థులు, యువత, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది భారీగా పాల్గొని జాతీయ ఐక్యత పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. భారతదేశాన్ని సంఘటితం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. జాతీయ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలన్నారు. కరీంనగర్ నగరంలో జాతీయ ఏకత్వపు జ్యోతి వెలిగిందని సీపీ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీం రావు, కమిషనరేట్‌కు చెందిన అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


