- వైద్యుల నిర్లక్ష్యంతో పాప మృతి!
- దవాఖాన ఎదుట బాధితుల ఆందోళన
- యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హన్మకొండ లక్ష్మినరసింహ దవాఖానలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తండ్రి హుజురాబాద్‌కు చెందిన ఎదురుగట్ల శ్రీనాథ్ ఆరోపించారు. పాప ఆరోగ్యంగానే ఉందంటూ వైద్యులు నమ్మబలికారని, ఇప్పటి వరకు తమతో లక్ష యాభై వేల రూపాయల బిల్లు కట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. పాప మృతికి ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈనెల 21న పాప పుడితే గుండె పనితీరు అన్ని సరిగా ఉన్నాయని చెప్పిన డాక్టర్లు దాదాపు వారం రోజుల తర్వాత పాప చనిపోయిందని చెప్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాము ఆసుపత్రిలో చేర్పించిన రోజే నొప్పులతో బాధ పడుతుంది ఆపరేషన్ చేయమంటే వైద్యురాలు నిరాకరించి ఎవరికి చెప్పకుండా ఈనెల 21 న ఆపరేషన్ చేసి తల్లి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్ని పొంతన లేని సమాధానాలు చెప్పి తీరా ఇన్ని రోజుల తర్వాత పాప చనిపోయిందని చెప్పడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని వారు ఆరోపించారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విషయం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులను సముదాయించడంతో శాంతించారు.


