- బతికుండగానే మార్చురీకి
- గదిలో పెట్టి తాళం వేసిన వైనం
- వైద్య వృత్తికే కళంకం తెచ్చిన ఘటన
- రాత్రంతా భయం భయంగా మార్చురీ గదిలోనే బాధితుడు
కాకతీయ, మహాబూబాబాద్ ప్రతినిధి : బతికుండగానే చనిపోయాడంటూ ఓ రోగిని రాత్రంతా మార్చురి గదిలో శవాల మధ్యలో స్ట్రక్చర్ పై ఉంచి గది కి తాళం వేసిన భయానక ఘటన మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు అనే బాధిత రోగి కిడ్నీ సంబంధిత సమస్యతో భాధ పడుతుండగా మానుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుందామని వెళ్లాడు. అతడికి ఆధార్ కార్డు లేకపోవడంతో సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు.
దీంతో బాధిత రోగి ఆరోగ్యం నీరసించిన స్పృహా కోల్పోయాడు. దీంతో మృతి చెందాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది గుర్తు తెలియని శవంగా భావించి బుధవారం రాత్రి మార్చురీ గదిలో స్ట్రక్చర్ పై భద్రపరిచి ఆ గది కి తాళం వేశారు. తెల్లవారుజామున గదిని శుభ్రం చేద్దామని వెళ్లిన స్వీపర్ కు బాధిత రోగి ఏడుస్తూ కనపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. తీరిగ్గా తేరుకున్నా ఆస్పత్రి అధికారులు బాధిత రోగిని మార్చురీ నుంచి బయటకు తీసుకువచ్చి రికార్డులో నమోదు చేసి ఏఎంసీ లో అడ్మిట్ చేశారు. నిత్యం పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పేద, గిరిజన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అడ్మిట్ రికార్డ్, డెత్ రికార్డు ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం నిరాకరిస్తోంది.


