కాకతీయ, కరీంనగర్ : బుధవారం కురిసిన అకాల వర్షాల వల్ల మండలంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును సందర్శించి వర్షపు నీటితో తడిసిపోయిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకం వేయాలని కోరారు. పంట నీట మునిగిపోయిందని, రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ రైతుల పక్షాన ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.


