- డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వందల ఎకరాల పంట నీటిపాలు
- సింగపూర్ రైతుల రాస్తారోకో
- చెరువు ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్..
కాకతీయ, హుజురాబాద్: జాతీయ రహదారి కాంట్రాక్టు సంస్థ డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో తమ పంట పొలాలు నీట మునిగాయని ఆరోపిస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామ రైతులు గురువారం హుజూరాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగపూర్ చెరువు వద్ద డీబీఎల్ కంపెనీ సరైన బ్రిడ్జిని నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా చెరువు మత్తడి పొంగి వెళ్లే నీరు సక్రమంగా ప్రవహించక బ్యాక్ వాటర్‌తో గ్రామానికి చెందిన దాదాపు 150 ఎకరాల వరి పంట పూర్తిగా మునిగిపోయింది. వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీట మునగడంతో రైతులు లక్షల రూపాయల నష్టాన్ని చవిచూశారు.
సింగపూర్ గ్రామానికి చెందిన తుమ్మనపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు కౌరు సుగుణాకర్ రెడ్డి మాట్లాడారు. “సింగపూర్ చెరువు వద్ద సరైన బ్రిడ్జి నిర్మించాలని జాతీయ రహదారుల డైరెక్టర్ కృష్ణారెడ్డికి, ఇరిగేషన్ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇరిగేషన్ అధికారులు, డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే నేడు రైతుల వందల ఎకరాల పంట నష్టపోయాం. ఇది మాకు తీరని నష్టం” అని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డీబీఎల్ కంపెనీ సింగపూర్ చెరువు ప్రాంతంలో తక్షణమే బ్రిడ్జిని నిర్మించాలని సుగుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.


