- బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్
కాకతీయ, నల్లబెల్లి : మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలతో పాటు వెన్నుదశలో ఉన్న పంటలు నేలకొరిగి నీటిలో మునిగిపోయాయని తెలిపారు. దీని ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను హెచ్చరికలు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే పంట నష్టం తీవ్రంగా పెరిగిందని ఆయన విమర్శించారు. పంట నష్టం అంచనా వేయడానికి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు తక్షణమే బృందాలు ఏర్పాటు చేసి పంటల పరిస్థితిని పరిశీలించాలని కోరారు. దెబ్బతిన్న రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించారు. ఎకరాకు వరి పంటకు రూ.25 వేలూ, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ప్రకటించి రైతులను, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, వెంకటేశ్వర్, నాగరాజు, కుమారస్వామి, కృష్ణ, పర్వాతలు, ప్రతాప్, రాజిరెడ్డి, చిరంజీవి, సాగర్, దేవేందర్, మధుకర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


