- గడిచిన మూడు నెలల్లో పదికి పైగా మిస్సింగ్ కేసులు
- మిస్ అయిన వారు ఎక్కడ..? ఏం అవుతున్నారు..?
- ప్రేమ వ్యవహారాలా..? లేక అక్రమ సంబంధాలా..?
కాకతీయ, గీసుగొండ: గత కొద్ది కాలంగా గీసుగొండ పోలీసు పరిధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో పదికి పైగా యువతులు, మహిళలు, యువకులు మిస్సింగ్ కేసులుగా నమోదయ్యాయి. ఈ ఘటనలు పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.మిస్సింగ్ కేసుల్లో కొంతమంది కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు వంటి కారణాల వల్ల ఇళ్లను విడిచి వెళ్లిపోయినట్లు విచారణలో తేలినప్పటికీ, మరికొంతమంది ఇప్పటికీ గుర్తు తెలియని మార్గంలో ఉన్నారు. ఈ కేసులను ఛేదించేందుకు గీసుగొండ పోలీసులు క్షేత్రస్థాయిలో సవరణ చర్యలు చేపట్టారు.ప్రతి మిస్సింగ్ కేసును ప్రాధాన్యంగా తీసుకుని, కాల్‌డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, స్నేహితులు, బంధువుల వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తు న్నారు.దొరికిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తుండగా, ఇంకా కనిపించని కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ — కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలతలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో ఇల్లు విడిచి వెళ్లకుండా సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సమాచారం కనిపించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
*ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు..
గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పర్యవేక్షణలో పోలీసులు ప్రతి మిస్సింగ్ కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల సహకారం లభిస్తే మిస్సింగ్ కేసులను మరింత వేగంగా ఛేదించగలమని సీఐ విశ్వేశ్వర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


