- డీసీసీల నియామకాల్లో అదే ఫైనల్ అర్హత
- అందుకే ఎమ్మెల్యే, మంత్రులు చెప్పినవారికే పార్టీ పదవి
- పనితీరును బట్టి కాకుండా పైరవీ, పైసలును బట్టే నియామకం
- తయారు చేసిన నివేదికలు.. చేసిన సర్వేలు అన్నీ దండగేనా..!
- చెప్పేదొకటి..చేసేదొకటంటూ అధిష్ఠానంపై కాంగ్రెస్ క్యాడర్‌లో గర్రు గుర్రు.!
- ఎమ్మెల్యేలకు డీసీసీలు, సీనియర్లకు జోడు పదవుల నియమం వర్తించదన్న టీపీసీసీ చీఫ్
- మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల తర్వాత పెరిగిన నైరాశ్యం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల పందేరం కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కితే.. రాజకీయ గౌరవంతో పాటు భవిష్యత్ రాజకీయానికి బాటలు పడుతాయనే యోచనతో వందలాది మంది ఆశావహ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 33 మూడు జిల్లాల డీసీసీలకు ఒక్కో జిల్లా నుంచి సుమారుగా 12 నుంచి 18 వరకు దరఖాస్తులు అందాయి. కష్టపడి పనిచేసినా నాయకులకు, సీనియర్లకు, వెనుకబడిన సామాజిక వర్గం నేతలకు డీసీసీ పదవులు ఇవ్వనున్నట్లుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకురాలు, పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పలుమార్లు ఉద్ఘాటించారు. ఈమేరకు ఐదేళ్లకు పైబడి పార్టీలో పనిచేస్తున్న లీడర్లలో డీసీసీ పదవులపై ఆసక్తి, ఆశలు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఈమేరకు ఒక్కో డీసీసీ అధ్యక్ష పదవి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
సొంత నిబంధనలకు అధిష్ఠానం తూట్లు..!
కాంగ్రెస్ పార్టీ నియామావళి ప్రకారం.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి కాకుండా పార్టీలో ఏళ్లుగా ఉంటున్న సీనియారిటీ, సమర్థతల ఆధారంగా పార్టీలోని పదవులకు నియమించాల్సి ఉంది. అయితే తాము నియమించుకున్న నిబంధనలను తామే ఉల్లంఘిస్తున్న చందంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వ్యవహారం ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి డీసీసీల నియామకంపై ఉమ్మడిగా.. విడివిడిగా భేటీ అయ్యారు. డీసీసీల నియమాకానికి ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు పేర్లను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఏం జరిగిందో తెలియదు కాని అంతకు ముందు అధిష్ఠానం పెట్టుకున్న నిబంధనను ఎత్తేస్తూ… ఎమ్మెల్యేలకూ, కార్పోరేషన్ చైర్మన్లకూ కూడా డీసీసీ పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పడం గమనార్హం. ఇక ఒకే కుటుంబంలో రెండు రాజ్యంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి సైతం వెసులుబాటు కల్పిస్తూ కొత్త డెసిషన్స్ తీసుకోవడం విశేషం. అవుటఫ్ ది బాక్స్ అంశంగా..అల్టీమేట్‌గా పార్టీని నడిపించే ఆర్థిక స్థోమత ఉందా..! డబ్బులు ఖర్చు చేయగలడా లేదా అన్న అంశం ఆధారంగానే డీసీసీ పదవుల నియామకానికి అంతిమ అర్హతగా చూస్తున్నట్లుగా ముఖ్య నేతల ద్వారా తెలుస్తుండటం గమనార్హం.
మారిపోయిన పీసీసీ చీఫ్ మాట
కేసీ వేణుగోపాల్‌తో భేటీ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు డీసీసీకి దరఖాస్తు చేసుకున్న సీనియర్లు, ఆశవహులైన యువ నేతలను కొంత నైరాశ్యం చెందేలా చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్‌లకు డీసీసీలుగా నియమించే అవకాశం ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. డీసీసీ పదవుల కోసం చాలాచోట్ల ఎమ్మెల్యేలతో పాటు వారి ప్రధాన అనుచరులనే లేదంటే ఎమ్మెల్యేలు తమ సతీమణులను, వారసులచే దరఖాస్తు చేయించుకున్నారు. వీలైతే..తనకు లేదంటే తమన సతీమణికి, యువత కోటాలో తన కొడుకుకు..తమ కుటుంబానికి కాకుంటే తాను చెప్పే అనుచరుడికి డీసీసీ ఇవ్వాలని అధిష్ఠానం పెద్దలకు తెలుపుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ డీసీసీ పదవిపై కన్నేసిన ఓ ఎమ్మెల్యే ఇదే తరహా డిమాండ్‌ను అధిష్ఠానం ముందు ఉంచినట్లు సమాచారం. అంతేకాదు..ఓ డబ్బుగలిగిన వెనుకబడిన సామాజిక వర్గం నేతతో ఇటీవల మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. కష్టపడిన వారికే కాంగ్రెస్ పార్టీ పదవులంటూ చెప్పిన అధిష్ఠానం పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పైరవీ, సిఫార్సులతోనే పదవులు ఇచ్చేందుకు సిద్ధపడుతుండటంపై తీవ్ర నిరాశ, నిస్పృహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాత్రం దానికి ఇంత హడావుడి.. సర్వేలు, అభిప్రాయ సేకరణలు, ఎందుకు..?! ఎమ్మెల్యేలు, మంత్రుల ఇష్టాయిష్టాలను తెలుసుకుని పదవులను పంచితే సరిపోతుంది కదా అంటూ నిరాశతో కూడిన ప్రశ్నలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
పర్సన్ ఫస్ట్.. పార్టీ నెక్ట్స్..!
పార్టీ ఫస్ట్.. పర్సన్ నెక్ట్స్ అనేది విజయవంతమైన రాజకీయ పార్టీలు అనుసరించే విధానం. పార్టీ విధానంలో పర్సన్స్ పనిచేయాలి కాని..పర్సన్స్ విధానాలకు, సొంత ఎజెండాలకు, కోరికలకు, డిమాండ్లకు అనుగుణంగా పనిచేయొద్దన్నది ప్రాథమిక నియామవాళి. అయితే డీసీసీ అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ పార్టీ తాము పెట్టుకున్న నిబంధనలను..మంత్రులు, ఎమ్మెల్యేల డిమాండ్లకు అనుగుణంగా మార్చుకుంటూ పర్సన్స్‌కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ..పార్టీని నెక్ట్స్ చేస్తున్నారనే విమర్శలు సగటు కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది లీడర్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించవచ్చు.. లేదంటే ఆయా జిల్లాల్లో వారి ప్రభావం ఉంటే ఉండొచ్చు గాక.. కానీ కొత్త క్యాడర్‌ను, కొత్త తరానికి రాజకీయ ప్రొత్సాహం లేకుంటే పార్టీ రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు. డీసీసీ నియామక ప్రక్రియలో భాగంగా ప్రతీ జిల్లాలో ఏఐసీసీ అబ్జర్వర్లు నియోజకవర్గ స్థాయి సమావేశాల నుంచి నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలతో సంబంధం లేకుండా నియామకాలు జరిగితే పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్న విషయాన్ని అధిష్ఠానమే చాటినట్లవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంజరుగుతుందో చూడాలి మరి.


