కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలోని నిర్మల భరోసా ప్యానల్ వేగంగా దూసుకుపోతోంది. రోజురోజుకీ సభ్యుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. నిజాయితీ, నీతిమంతమైన పాలనతో బ్యాంకును నూతన దిశగా నడిపించేందుకు తాను సన్నద్ధమని రాజేందర్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ డిసిసి అధ్యక్ష పదవి రేసులోనూ ముందంజలో ఉన్న ఆయన, అర్బన్ బ్యాంక్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తమ ప్యానల్ గెలుపుతో బ్యాంకులో పారదర్శకత పెంపొందుతుందని, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నాలుగు కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని రాజేందర్ హామీ ఇచ్చారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియం, రోటరీ పార్క్, కాసుగంటి నారాయణరావు కళాశాల, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లో రాజేందర్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో గాదె కార్తీక్, కూసరి అనిల్ తమ ప్యానల్‌లో ఉన్నారని రాజేందర్ తెలిపారు. ఎమ్మెల్యే మద్దతుతో తమ ప్యానల్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.


