- హీరోల కంటే తక్కువ రెమ్యునరేషన్.. ప్రియమణి బోల్డ్ స్టేట్‌మెంట్!
కాకతీయ సినిమా: జెండర్ పే గ్యాప్.. సినీ ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ టాపిక్. హీరో, హీరోయిన్ ఒకేలా కష్టపడుతున్నప్పుడు పారితోషికాల్లో వ్యత్యాసం ఎందుకని ఇప్పటికే చాలా మంది నటీమణులు గమ గళాన్ని వినిపించారు. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి మాత్రం దీనిపై ఒక భిన్నమైన, బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో సమానంగా రాణిస్తూ, తన నటనతోనే గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పే గ్యాప్‌పై రియాక్ట్ అయింది. “ అవును… హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు కాస్త ఎక్కువ పారితోషికం ఇస్తారు. కానీ దాంట్లో తప్పేమీ లేదు. ఎవరికి ఎంత మార్కెట్ ఉందో, వారి రేంజ్ ఏంటో దానికి తగ్గట్టే రెమ్యునరేషన్ ఉంటుంది. నేను కూడా కొన్ని సందర్భాల్లో నా మేల్ కో స్టార్ కంటే తక్కువ రెమ్యునరేషన్ పొందాను. కానీ అది నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాకు నా విలువ తెలుసు. నేను అర్హురాలినని నమ్మే స్థాయిలోనే రెమ్యునరేషన్ అడుగుతాను. అనవసరమైన డిమాండ్ చేయను“ అని చెబుతూ హీరోయిన్లకు పరోక్షంగా ప్రియమణి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
తన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్, ప్రాక్టికల్ ఆలోచన, ఇండస్ట్రీలో ఉన్న వాస్తవాల్ని అంగీకరించే తీరుతో ప్రియమణి మరోసారి తన మేచ్యూరిటీని నిరూపించింది. ఓవైపు చాలా మంది హీరోయిన్లు “ మాకు హీరోలంత రెమ్యునరేషన్ ఇవ్వాలి“ అంటూ గగ్గోలు పెడుతుంటే, ప్రియమణి మాత్రం మార్కెట్ విలువే ముఖ్యం అనే రియలిస్టిక్ స్టాండ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, ప్రియమణి కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అందాల సోయగం ` జన నాయకన్` మూవీలోనే కాకుండా ` ది ఫ్యామిలీ మ్యాన్` మూడవ సీజన్ కోసం వర్క్ చేస్తోంది.


