మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్
తెలంగాణ డీజీపీ ఎదుట కీలక నేత సరెండర్
దాదాపు 45 ఏళ్లుగా పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. కేంద్ర కమిటీ సభ్యులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరి కొందరు ముఖ్య నేతలు కూడా నడుస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు. గత 45 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
సికాస నుంచి..
బండి ప్రకాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎస్‌యూ తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాష్. 1988లో బెల్లంపల్లిలో కమ్యూనిస్టు నేత అబ్రహం హత్యకేసులో జైలుకు వెళ్లారు. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తూనే నాటి పీపుల్స్‌వార్ కీలక నేతలు నల్లా ఆదిరెడ్డి తదితరులతో కలిసి జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో సంచలనంగా మారింది. దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా పనిచేసిన ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవాలి.


