- రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. సోమవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి దాదాపు రూ.800 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. సింగరేణి, ప్రభుత్వ నిధులతో రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి రామగుండంను మెడికల్ హబ్గా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ఆధునికీకరించి ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయాలన్నారు.
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం, వ్యాపారాభివృద్ధికి కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మాణం చేపడుతున్నామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహకారంతో 1×800 రామగుండం బీ పవర్ హౌస్ నిర్మాణం చేపడుతున్నామని బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. అభివృద్ధి కారణంగా కొంతమందికి తాత్కాలిక నష్టం కలిగినా దీర్ఘకాలంలో ప్రజలందరికీ లాభం చేకూరుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చుతామని రామగుండం పూర్వ వైభవం కోసం కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.


