- ఖమ్మం నగరానికి మంచినీటికి శాశ్వత పరిష్కారం
- రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికతో మంచినీటి సరఫరా
- 8 నెలలు మున్నేరు నుంచి సురక్షిత నీరు, 4 నెలలు పాలేరు జలాశయం నుంచి
- గతంలో దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ ద్వారా ఖమ్మం త్రీ టౌన్ కు మంచినీరు
- ఖమ్మానికి లకారం నుంచి నీటి సరఫరా
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం నగర ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆయన సంకల్పంకు అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం నగరానికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం కోసం రూ.200 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీ .వో నెంబర్.747 తేదీ 25.10.2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు రూపకల్పనతో ఖమ్మం కార్పొరేషన్ ప్రజల కల సాకారం చేసిన అపర భగీరధుడిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖ్యాతి పెరిగింది. ఆయన తపనతో ఈ ప్రణాళిక రూపుదిద్దుకోగా, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం నగరానికి అద్భుత స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు.
మున్నేరు, పాలేరు నుంచి నీటి సరఫరా…

నగరానికి సంవత్సరమంతా నిరంతరంగా మంచినీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
మున్నేరు నది నుంచి ఎనిమిది నెలలపాటు నీటి సరఫరా జరుగుతుండగా, వేసవి నెలల్లో పాలేరు జలాశయం నుంచి నీరు అందించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ విధంగా రెండు వనరుల ఆధారంగా ఖమ్మం నగరానికి నిరాటంకంగా రక్షిత నీటి సరఫరా జరిగేలా ముందు చూపుతో ప్రణాళికలు చేశామన్నారు.
గతంలో దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ ద్వారా త్రీ టౌన్ కు నీరు
గతంలో నగరంలోని త్రీ టౌన్ ప్రాంతాలకు దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ ద్వారా నీటి సరఫరా నిర్వహించబడేది. ఇప్పుడు ఆ వ్యవస్థను మరింత విస్తరించి ఆధునిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఖమ్మం నగరానికి ప్రధానంగా లకారం ట్యాంకు నుంచే నీటి సరఫరా కొనసాగుతోంది. అయితే, నగర విస్తరణతో పాటు జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న వనరులు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. దీనికి పరిష్కారంగా కొత్త పైపులైన్ వ్యవస్థలు, ఫిల్టర్‌బెడ్‌లు, పంప్‌హౌస్‌లు నిర్మించే ప్రణాళిక సిద్ధమవుతోంది.
ఖమ్మం అభివృద్ధికి పునాది
రక్షిత మంచినీటి సమస్యకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్‌లో ఖమ్మం నగర అభివృద్ధికి పునాది వేయనుంది. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణలో కూడా ఈ ప్రణాళిక కీలక పాత్ర పోషించనుంది. గతంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఖమ్మం నగర అభివృద్ధి పట్ల తుమ్మల నాగేశ్వరరావు చూపిన చిత్తశుద్ధి, నిరంతర కృషి ఈరోజు ఫలితాలుగా మారాయి. ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చే దిశగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల చూపిన చొరవ, కృషి ఫలితంగా కాంగ్రెస్ సర్కారు 200 కోట్లు కేటాయించిందని, ఖమ్మం నగర ప్రజలు ముఖ్య మంత్రికి మంత్రి తుమ్మల కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


