- గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేది
- ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు
- సోనాల మండలంలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా
- రోడ్డుపైనే వంటవార్పు నిర్వహించిన నిరసన
కాకతీయ, ఆదిలాబాద్ : మొక్కజొన్న కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల రైతులు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో సోమవారం సోయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన సోయా మరియు మొక్కజొన్న పంట చేతికొచ్చి ఒకపక్క తడిచి పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో సోనాల మండల కేంద్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసిందన్నారు. ఎప్పటికప్పుడు దాన్ని కొనుగోలు చేసింది.
పది నుంచి 20 రోజుల్లోనే డబ్బులు వేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని, రైతులకు రావలసిన రైతుబంధు విడుదల చేయాలని, పత్తి పంటను పాత పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు ముత్తన్న, జనార్ధన్ ,ఇర్ల అభిలాష్, భీంరావు పాటిల్, యల్ల సుధీర్ రెడ్డి, హరీష్, లంక లలిత, రామ్ కిషన్, వినోద్, సంజీవరెడ్డి, సుగుణాతుల .అభిలాష్,రాజన్న, ప్రదీప్, కృష్ణ, ఈశ్వర్, సంతోష్ ఇర్ల శ్రీధర్, నవీన్, శ్రీకాంత్, విట్టల్, మహేష్, ఆసిఫ్ షేక్, శ్రీనివాస్, ఏవిధ గ్రామాల రైతులు ,తదితరులు పాల్గొన్నారు.


