గర్జిస్తున్న పోలీసు తుపాకి..!
కాకతీయ, హైదరాబాద్ : వారం రోజుల్లోనే రెండు సార్లు తెలంగాణ తుపాకీ గర్జించింది. మొన్న నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్‌ను మట్టు బెట్టిన గన్.. తాజాగా హైదరాబాద్ లో మరో రౌడీ షీటర్ మహ్మద్ ఒమర్ అన్సారీపై దండెత్తింది. వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు తెలంగాణ పోలీసుల ధైర్యసాహసాలకు, త్వరితగత చర్యలకు అద్దం పడుతున్నాయి. రౌడీ షీటర్లను బెంబేలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు తీరుపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రౌడీ షీటర్ల దుస్సాహసాలకు చెక్ పెడుతూ.. రాష్ట్రంలో చట్టం, శాంతి, భద్రతలపై ఎంత కఠినంగా ఉన్నారో నిరూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
డీజీపీ గా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పోలీస్ యంత్రాంగంలో నూతన ఒరవడిని తీసుకువచ్చారు. నేరం ఏదైనా దాని మూలల్లోకి వెళ్ళి.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే దిశగా వ్యవస్థను దృఢంగా నడిపిస్తున్నారు. నేరం చేస్తే తప్పించుకోవడం అసాధ్యమనే సంకేతాలు నేరస్థులకు ఇస్తున్నారు. నిజామాబాద్ షేక్ రియాజ్ కేసులో ఆయన వ్యవహరించిన తీరుతో రౌడి షీటర్ల పట్ల తెలంగాణ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో చెప్పకనే చెప్పారు. అలాగే, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తన మార్క్ పోలీసింగ్ తో నగరంలోని నేరగాళ్లలో భయాందోళనలు మొదలయ్యాయి. రౌడీ షీటర్ అయినా, పిక్ పాకెటర్ అయినా చట్టం ముందు లోగాల్సిందే అనే ఆయన మాటలు వారిలో గుబులు పుట్టించాయి. తాజాగా అవే మాటలను నిజం చేస్తూ.. చాదర్‌ఘాట్ ఘటనలో రౌడి షీటర్ మహమ్మద్ ఒమర్ అన్సారీపై తీసుకున్న చర్యలు నగరమంతా చర్చనీయంగా మారాయి. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనర్ డెడ్లీ కాంబినేషన్ తెలంగాణ పోలీసింగ్ లో కొత్త అధ్యాయానికి తెరలేపిందనే ప్రచారం జరుగుతోంది. శివధర్ రెడ్డి విజన్, సజ్జనర్ యాక్షన్ రౌడీ షీటర్లకు భయం పుట్టిస్తుండగా.. నేరాల నియంత్రణ, భద్రత విషయంలో ప్రజలకు భరోసా కల్పిస్తోంది. తెలంగాణ పోలీస్ ఇమేజ్ ను ఉన్నత స్థానానికి వీరి నాయకత్వం తీసుకెళ్లింది.


