- అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు
- 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం
- బీఆర్ఎస్ పదేళ్లలో తగినంత గౌరవం దక్కలేదు
- ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి ఇవ్వాలి
- 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’
- ఆత్మగౌరవంతో కూడిన అభివృద్దే లక్ష్యం
- బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అమరవీరులకు.. వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగిందని చెప్పారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. 1 కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకూ తాను పోరాటం చేస్తానని ప్రమాణం చేశారు. ‘జనం బాట’ కు బయలు దేరే ముందు హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సరైన గౌరవం దక్కలేదు

తెలంగాణ సాధనం కోసం అమరలైన వారికి ఇవ్వాల్సిన గౌరవం తగినంత ఇవ్వలేకపోయామని కవిత అన్నారు. తాము ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పామని.. వారిలో 580 మాత్రమే ఇచ్చామని తెలిపారు. మిగిలిన వారికి న్యాయం చేయలేకపోయామన్నారు. ఉద్యమకారుల్లో కొంతమందికి రాజకీయంగా అవకాశాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాను మంత్రిగా లేకపోయినా.. ఎంపీగా.. ఎమ్మెల్సీగా అమరవీరులకు కుటుంబాలకు మరో రూపంలో డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేడుకల్లో చెప్పానని గుర్తు చేశారు. తాను ఇంకా ఎక్కువగా కొట్లాడాల్సి ఉండేదని.. అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణలు కోరారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ బాగుండాలని వారందరూ ప్రాణంత్యాగం చేశారని.. వారి కుటుంబాలకు రూ.కోటి విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం రూ.కోటి ఇవ్వకపోతే.. ప్రభుత్వాన్ని మార్చేసి.. వచ్చే ప్రభుత్వంతో అయినా వారికి న్యాయం జరిగే విధంగా చేస్తానని భరోసా ఇచ్చారు.
మేధావులతో చర్చలు
33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నానని కవిత తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలని.. బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి ఇప్పటికే పోరాటం చేస్తోందని.. వాటిని సాధించుకుంటామన్నారు. అన్ని జిల్లాల్లో మేధావులను కలుస్తానని.. ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటామన్నారు. జాగృతిలో ఇప్పటి వరకు పని చేసిన వాళ్లు మళ్లీ కలిసి రావాలని ఆహ్వానించారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే తన అభిమతమని అన్నారు కవిత.


