- సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి శివకుమార్
కాకతీయ, తుంగతుర్తి: అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని కామ్రేడ్ దుబ్బాక సంజీవరెడ్డి విజ్ఞాన కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోఆయన మాట్లాడారు. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని, కోసిన వరిచేలు ఐకేపీ కేంద్రంలో తడిసి ముద్దయ్యాయని, కోతకు వచ్చిన వరిచేలు నేలకు ఒరిగినాయని తెలిపారు. పత్తి చేలు పత్తి ఏరకుండానే గింజలు మొలకెత్తి పాచిపోయిందని, అప్పుచేసి పంటలు పండిస్తే మొత్తం పంటలన్ని వర్షార్పణం అయినాయని ఆయన ఆవేదన చెందారు. తడిసిన పత్తి, వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. లేనియెడల తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వేర్పుల లక్ష్మయ్య, పీవైఎల్ జిల్లా కార్యదర్శి వేర్పుల పరుశురాం, తదితరులు పాల్గొన్నారు.


