- బైక్‌ను బస్సు ఢీ కొట్టలేదు
- ముందుగా బైక్ స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టింది
- కిందపడిన బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి
- బైక్ నడుపుతున్న శివశంకర్ స్పాట్‌లోనే మృతి
- వెనుక కూర్చున్న ఎర్రిస్వామి అనే యువకుడ్ని ప్రశ్నించిన పోలీసులు
- ఆయన వాంగ్మూలంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు ఘోర బస్సు ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలుచెలరేగి 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో బైక్ నడిపిన యువకుడు శివశంకర్ కూడా మృతిచెందాడు. అయితే.. బైక్‌పై శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బైక్‌ను నేరుగా ఢీకొట్టడం వల్లే మంటలు చెలరేగాయని భావించగా, పోలీసుల దర్యాప్తులో అది తప్పని తేలింది. బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణిస్తూ స్వల్ప గాయాలతో బయటపడిన ఎర్రిస్వామిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం..
శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరూ బైక్‌పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయలుదేరారు. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయల్దేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని, రోడ్డు మధ్యలో ఉన్న బైక్ ను పక్కకి తీయాలని అనుకున్నాడు.
కీలకంగా మారిన ఎర్రిస్వామి వాంగ్మూలం
శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్‌ను చాలాదూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు మంటల్లో చిక్కుకోవడం చూసిన ఎర్రిస్వామి భయపడి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లిపోయాడు. కాగా, ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత నిన్న ప్రకటించిన విషయం విదితమే. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించినా, ఎర్రిస్వామి వాంగ్మూలంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చింది.


