కాకతీయ, హుజురాబాద్: రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ కనుకయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతున్నా వారికి రావాల్సిన గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యుటేషన్, సరెండర్ లీవులు వంటి ఆర్థిక ప్రయోజనాలు ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ ప్రయోజనాలపైనే వృద్ధాప్య జీవితం ఆధారపడి ఉంటుందని, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోలేక, ముఖ్యమైన ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నిధులు అందక అనేకమంది విశ్రాంత ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారని వాపోయారు. ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల కష్టాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం విడుదల చేయాలని తహసీల్దార్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్మెంట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


