- బాలిక మృతిపై శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
- ఓటు చోరీపై కౌశిక్ రెడ్డి చెంప చెళ్లుమనిపించిన ఈసీ
- ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేత ప్రణవ్ విమర్శలు
కాకతీయ, హుజురాబాద్ :వంగర హాస్టల్లో హుజురాబాద్ మండలానికి చెందిన శ్రీ వర్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి చేసిన ధర్నా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, పాప చనిపోయి పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు ఉంటే దీన్ని కౌశిక్ రెడ్డి అదునుగా తీసుకొని పోస్ట్ మార్టం అయిన తర్వాత బాలిక మృతదేహాన్ని అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ధర్నా చేయడం నీచమైన రాజకీయమని అన్నారు.
అప్పుడు ఓట్ల కోసం సెంటిమెంట్ వాడుకున్నాడని, ఇప్పుడు శవరాజకీయాలను కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఇది సిగ్గు చేటని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యేను దేశంలో ఇంతవరకు చూడలేదని అన్నారు. కౌశిక్ రెడ్డికి అంతలా సహాయం చేయాలి అనుకుంటే నేరుగా అధికారులతో మాట్లాడి సహాయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిదికాదని అన్నారు. ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డికి ఎన్నికల సంఘం గట్టిగా బుద్ధి చెప్పిందని, చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిందని ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఓట్లు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నాయని సమాధానం ఇవ్వగా బీఆర్ఎస్ నాయకులు తెల్లమొహం వేశారని అన్నారు.


