ఎంజీఎంలో అధ్వానంగా వైద్యం
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైనా ఆస్పత్రిపై సర్కారు నిర్లక్ష్యం
వెంటాడుతున్న మందుల కొరత.. సరిపోను బెడ్లు కరువు
ఎంజీఎంకు వస్తే ప్రాణాలు అటో ఇటో..! అన్న పరిస్థితి
గాడి తప్పిన పరిపాలనా.. లోపిస్తున్న పర్యవేక్షణ
కలెక్టర్ సత్యశారద శ్రద్ధ చూపినా.. ప్రభుత్వం నుంచి చర్యల లేమి
కాకతీయ, వరంగల్ : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఆస్పత్రిలో సేవలు మృగ్యంగా మారాయి. నిర్వహణను పర్యవేక్షించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆస్పత్రిలో సేవలు అరకొరగా అందుతుండటమే కాదు..కనీసం పేషంట్లను చూసేందుకు కూడా వైద్యాధికారులు సమయ వేళలు పాటించడం లేదు. ఇక ఆస్పత్రికి నిత్యం వందలాది మంది ఓపీ అవుట్ పేషంట్లు వైద్య సేవల కోసం వస్తుండగా.. వారికి సరిపోను బెడ్లను సమకూర్చకపోవడం ఆస్పత్రి వైద్యాధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఓవైపు ఎంజీఎంను అద్భుతంగా తీర్చిదిద్దుతామనే ప్రభుత్వ చెబుతుండగా.. వాస్తవ పరిస్థితి మాత్రం.. అవన్నీ ప్రగల్బాలు అన్నట్లుగానే పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఒకే బెడ్ లో ఇద్దరు పేషెంట్లు ఉండటమే కాకుండా ఒకే సిలిండర్ ఇద్దరిద్దరికీ ఒకేసారి ఉపయోగించడం జరుగుతోంది. ఇద్దరి చిన్నారులకు ఆక్సిజన్ సిలిండర్ తో తరలిస్తున్నటువంటి దృశ్యాలు శనివారం వెలుగులోకి రావడం ఎంజీఎంలో అత్యంత దారుణ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.
కలెక్టర్ సత్య శారద ప్రత్యేక శ్రద్ధ.. అయినా..!
వాస్తవానికి వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్ ఎంజీఎంను గాడిలో పెట్టేందుకు అనేక మార్లు రివ్యూలు నిర్వహించారు. వైద్యాధికారులను కూడా మార్చారు. వీలున్నప్పుడల్లా సందర్శిస్తున్నారు. అయితే కలెక్టర్ ఎన్ని రివ్యూలు చేసినా.. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ఎంజీఎం అధికారుల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండటం లేదు. అంతేకాదు వారి పనితీరులో ఎలాంటి శ్రద్ధ కనిపించడం లేదు. వైద్య సేవలు అందకపోవడంతో ఎంజీఎంలో మృత్యుఘోష వినబడుతూనే ఉందనే విమర్శలున్నాయి. ఎంజీఎం ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం విద్యుత్ సరఫరాకు దాదాపు ఐదు గంటల పాటు అత్యవసర సేవలకు కరెంటు నిలిచిపోయింది. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఈ ఘటనలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. అయితే ఆ నివేదిక అందినా ఎంజీఎం వైద్యాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ ఉదాసీనత వైఖరిని స్పష్టం చేస్తోందన్న విమర్శలున్నాయి.
గతంలో శవాలు తారుమారు..!
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మృతదేహలు మారిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధమైన బంధువులకు పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. చనిపోయాడని భావించిన కుమారస్వామి బతికే ఉన్నాడని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. గతంలో ఎంజీఎం ఆస్పత్రిలో పేషంట్ల రిజిస్ట్రేషన్ల వివరాలు కూడా సరిగా పొందు పర్చకపోవడంతో శవాలు తారుమారయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మూడు రోజులు చికిత్స పొందిన తర్వాత మరణించాడని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు. తర్వాత చివరి చూపు చూసేందుకు శవపై కప్పిన క్లాత్ ను తొలగించి చూశాక అంతా షాక్ అయ్యారు. అతను మా నాన్న కాదని కుమారస్వామి కూతురు స్పష్టంగా చెప్పడంతో తిరిగి శవాన్ని మార్చూరీకి చేర్చారు. అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.


