- బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : జీఎస్టీ తగ్గింపు రైతులకు వరంగా మారిందని నూతన ట్రాక్టర్ కొనుగోలు పై ఏడు శాతం పన్నులు తగ్గడంతో ఒక్కో ట్రాక్టర్ పై రూ. 40 వేల నుంచి రూ.1 లక్ష రూపాయల వరకు ధర తగ్గి రైతులకు మేలు కలుగుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ నిర్వహిస్తున్న జీఎస్టీ సంబరాల మాసోత్సవం లో భాగంగా బిజెపి కరీంనగర్ జిల్లా చొప్పదండి రూరల్ శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చొప్పదండి పట్టణంలోని ట్రాక్టర్ షోరూమ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో రూ.19 వేల కోట్లు ఆదా కలుగుతుందన్నారు. తెలంగాణ లో ఉన్న 84 లక్షల కుటుంబాలలో సగటున ఒక్కో కుటుంబానికి ఏటా 10 వేల నుంచి 30 వేలు జీఎస్టీ తగ్గింపు తో ఆదా కలుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.


